32. నతేన రాజా పరితోషః క్షుచ్ఛాంతిర్వా

32. నతేన రాజా పరితోషః క్షుచ్ఛాంతిర్వా 

            సన్యాసి పుత్రుడు కాడని, రాజకుమారుడేనని తెలియగానే, అతడు పుట్టుక తోనే రాజకుమారుడని నిర్ణయమైంది. మధ్యలో అతడు సన్యాసి కుమారుడనేది అజ్ఞానావరణ. ఆవరణ తొలగగానే తాను రాజకుమారుడనే అనేది స్పష్టం. అలాగే తన గృహమందు తాను చేరి తన పూర్వ సుఖాన్ని తాను మరలా పొందాడు గాని, అది క్రొత్త సుఖం కాదు. దేశాంతరాల అనుభవాలు కొంతకాలం స్వగృహ సుఖాన్ని మరుగుపరిచాయి గాని, చివరకు అడ్డు తొలగగానే స్వగృహ సుఖం ఉన్నచోటనే ఉన్నది. సుఖానికి దూరమైనట్లు భ్రాంతి కలిగింది. తిరిగి దగ్గరవు తున్నట్లు కూడా భ్రాంతి కలిగింది. అతడి స్వగృహ సుఖం స్మృతిలో ఉండాలి.కాని కొంతకాలం మరుపులో పోయినట్లున్నది గాని, నిజానికి ఆ సుఖం ఎల్లప్పుడూ ఉంది.

            మధ్యమధ్యలో ఆకలి బాధ కలిగి, తన సహజ తృప్తిని మరిపించింది గాని, ఆకలి బాధ అనే అడ్డు తొలగగానే, అది నిత్య తృప్తేనని, క్రొత్తగా వచ్చేది కాదని తెలుస్తుంది.  అలాగే భగవత్ప్రాప్తి సహజ సిద్ధం. మరపు అనే అజ్ఞానంలో  భగవత్ప్రాప్తి లేనట్లు ఉంటుంది. అజ్ఞాన ఆవరణ తొలగగానే ప్రాప్తించి నట్లుంటుంది. కాని భగవంతుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూనే ఉన్నాడు. భక్తుడు కూడా భగవంతునిలా నిత్యం ఆనందమయుడే. ఆవరణ తొలగగానే ఆనందమే తానైన పరాభక్తుడు, ఆనందమే తానైన భగవంతుడు ఒక్కటే.


            దేవాలయంలో విగ్రహాన్ని కనబడకుండా తెర వేశారనుకుందాము. భగవంతుడు కనబడలేదు. తెరతీయగానే కనబడ్డాడు. భగవంతుడు అక్కడకు క్రొత్తగా వచ్చాడా ? అక్కడే ఉన్నాడు. తెర మాత్రం అడ్డుగా ఉంది. తెర తొలగగానే దర్శనమైంది. అంతే ! మనలో ఆత్మ సత్యం, నిత్యం. కొంత కాలం అజ్ఞాన కారణంగా జీవ భావం కలిగి ఆత్మానుభవాన్ని కప్పి వేసింది. భక్తి, కర్మ, జ్ఞాన, యోగ సాధనలచేత, కప్పిన ముసుగును తొలగించుకోగానే కలిగిన ఆత్మానుభవం స్వతస్సిద్ధం, సహజం.