ప్రస్తావన

ప్రస్తావన
            భక్తి, జ్ఞానం, యోగం అనేవి మనకు అంతో ఇంతో తెలుసు. కాని ముక్తి అనే గమ్యం చేరడానికి అవి ఎలా ఉపయోగపడతాయో పూర్తిగా తెలియదు. ఈ మూడు ఎందుకు కావాలి ? ఎలా ఆచరించాలి ? లక్ష్యం ఏమిటి ? అనేవి అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోవలసి వుంది. అయితే మనం కొన్నింటిమీద ఆసక్తి కలిగి చేస్తూ ఉంటాము. ఆసక్తి లేనప్పుడు దేనికైనా దూరంగా ఉంటాము. కొందరైతే వారి కుటుంబంలో పెద్దల ద్వారా వారసత్వంగా గాని, సంప్రదాయంగా గాని ఆచరిస్తూ ఉంటారు.

            అలసులు మందబుద్ధి బలు లల్పతరాయువు లుగ్రరోగసం
            కలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాల రీ
            కలియుగమందు మానవులు, కావున నెయ్యది సౌఖ్యహేతువై
            యలవడునేమిటం గలుగు నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే భాగవతం

తా||  కలియుగమందు మానవులు భక్తి జ్ఞాన యోగముల వంటి సుకర్మలు చేయజాలరని, వారి అశక్తతలను ఈ పద్యంలో తెలుపుచున్నారు. కలియుగ మానవులు సోమరులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, శక్తి హీనులు, తీవ్ర రోగగ్రస్తులు, దురదృష్టవంతులు, సత్కర్మలందాసక్తి లేనివారు. ఇట్టి మానవులు తరించే మార్గమేదని సూత మహామునిని శౌనకాది మునులు కోరగా భాగవతాన్ని ప్రవచించి, మానవులకు భక్తి మార్గం అందించెను.

శ్లో||  క్షీయమానేషు దేహేషు దేహినాం కలిదోషతః
            వర్ణాశ్రమ వతాం ధర్మే - నష్టే వేదపథేనృణాం
            పాషండ ప్రచురే ధర్మే దస్యు ప్రాయేషు రాజసు
            చౌర్యానృత వృథా హింసా - నానా వృత్తిషు వైనృషు
            శూద్ర ప్రాయేషు వర్ణేషు - భాగప్రాయాసు ధేనుషు
            గృహ ప్రాయేష్వాశ్రమేషు - యౌనప్రాయేషు బంధుషు
            విద్యు త్ప్రాయేషు మేఘేషు - శూన్య ప్రాయేషు సద్మసు
            ఇత్థమ్‌ కలే గతప్రాయే - జనేషు ఖర ధర్మిషు
            ధర్మత్రాణాయ సత్త్వేన భగవానవతరిష్యతి
-భాగవతం
తా||  కలికాల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. మానవుల శరీరాలు క్షీణిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తాయి. పాషండ ధర్మం పాటిస్తారు. రాజులంతా దొంగలై, పరిపాలించేవారు దోపిడి దారులై, ప్రాణికోటికి అపకారం చేసే వారుగా ఉంటారు. మానవులంతా వర్ణాశ్రమ ధర్మం విడచి శూద్రులవుతారు. గోవులన్నీ పవిత్రత కోల్పోయి మేకలు, గొఱ్ఱెలుగ క్షీణిస్తాయి. ఆశ్రమాలు వైభవోపేత భవనాలవుతాయి. యోని సంబంధమే బంధుత్వంగా మారుతుంది. ఓషధులు వనస్పతులు క్షీణిస్తాయి. మేఘాలు మెరుస్తాయే గాని వర్షించవు. ఊళ్ళు పల్లెలు బీడులౌతాయి. ఇట్టి పరిస్థితులలో భగవంతుడవతరిస్తాడు, ధర్మసంస్థాపన చేస్తాడు.
            ఇట్టి కలిదోష నివారణకు భక్తి మార్గమే సులభం. కాని మనం చూచే చాలామంది భక్తులకు నిజభక్తి అంటే ఏమో తెలియదు. వారు ఆచారం వలన భక్తులనిపించుకుంటున్నారు. వారు జీవించే తీరులో సచ్చీలత లోపిస్తున్నది. వారి భక్తిలో శ్రద్ధ కనిపించడం లేదు. భక్తి చేసే పద్ధతిలో శాస్త్రీయత లేదు.
            భక్తి లక్ష్యమేమంటే భక్తుడు భగవంతునితో నిత్య సాహచర్యం చేయడంభగవంతునితో లక్షణయుతంగా ఐక్యం కావడం. కాని ఆచరణలో వారి భక్తి కాలక్షేపంగానో, లేక బాధలు తీర్చమని వేడుకోవడానికో, లేక మ్రొక్కులు మ్రొక్కి, కోరికలు తీర్చుకోవడానికో ఉద్దేశించబడి ఉంటున్నది.
            ప్రస్తుతం మనం అన్ని మతాలలోనూ చాలామంది భక్తులను, విశ్వాసులను చూస్తున్నాం. కాని ఇంతమంది ఆస్తిక్య బుద్ధిగల మన దేశంలో అవినీతి, అక్రమార్జన కూడా ఎక్కువగానే ఉన్నది. అవినీతి పరులు వేరు, భక్తులు వేరు అయితే చింతించవలసిన పనిలేదు. ఒకవైపు భక్తులమని చెప్పుకుంటూనే నిజ జీవితంలో సచ్చీలత, సదాచారం పాటించడం లేదు. బహుశః జీవించే పద్ధతికి, భక్తి సలపడానికి సంబంధం లేదని, ఇహం, పరం దేనికదే విడివిడిగా సాధించుకోవచ్చని వారి అభిప్రాయమై ఉంటుంది. కాని భక్తి సూత్రాలు ఇహంలో చేసే సాధనను, భక్తిని పెంపొందించడానికి ముడిపెడుతున్నాయి.
            చేసినగాని పాపములు చెందవు చేయదలంచినంతటన్‌
            చేసెదనన్న మాత్రమున జెందుగదా కలివేళ పుణ్యముల్‌
            మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్‌ మరంద ము
            ల్లాసము తోడ గ్రోలి విరులం దెగజూడని తేటికైవడిన్‌
            - భాగవతం
తా||  పరీక్షిత్తు మహారాజు అన్నాడు. ''కలి కాలంలో మానవులకు ఒక అవకాశం ఉంది. అదేమంటే పాపం చేస్తానని మనసులో అనుకుంటే ప్రమాదం లేదు. పాపం చేస్తేనే అది ఫలిస్తుంది. పుణ్యమనేది సంకల్పం చేసింతన మాత్రానే ఫలిత మిస్తుంది. కాబట్టి మోసం లేక, త్రికరణ శుద్ధితో అప్రమత్తులై, ధీరులై భగవచ్చింతనతో జీవిస్తే వారికి తరించే అవకాశం ఉంది. కృతయుగంలో చేసినంత తీవ్ర సాధనలతో ఈ కలియుగంలో పనిలేదు.''
            ఈ మధ్య నారద భక్తి సూత్రాలు అనే గ్రంథం చదవడం జరిగింది. అది భక్తి జ్ఞాన మిశ్రమంగా ఉంది. మానవులలో అజ్ఞానం, అహంకారం తొలగితే గాని అతడి భక్తి సాఫల్యం కాదని తెలిసింది. ఏ పనినైనా ప్రయోజనం లేకపోతే, చేసేపని వ్యర్థమేగా ! అలాగే భక్తి ఆచరణలో కూడా వ్యయ ప్రయాసలు పడటం అంటే, సరియైన ఫలితం రానప్పుడు అది కూడా వ్యర్థమే కదా ! అప్పుడది తోచక చేసే కాలక్షేపం అవుతుంది. ఒక్కోసారి పిచ్చిపని అవుతుంది కూడా. భక్తి లక్ష్యం జీవేశ్వరైక్యం అని తెలిసి, శాస్త్రీయంగా చేసినట్లైతే స్వార్థం, అహంకారం మొదలైన వాటిని తొలగించుకోవలసి ఉంటుందని భాగవతం చెప్తున్నది. అందువలన ఇంతకు ముందు ఈ నారద భక్తి సూత్రాలకు ఎంతమంది వ్యాఖ్యానం వ్రాసినా పైన వివరించిన లక్ష్యాన్ని ప్రధానంగా చేసుకొని మరలా మరో కోణంలో వ్యాఖ్యానం వ్రాయ సంకల్పించి, భక్తి క్రియలలో ఉండవలసిన నిజతత్త్వాన్ని ఎత్తి చూపి, భక్తులనిపించుకొనే వారిని నిజమైన భక్తిమార్గంలో ప్రవేశింప జేయవచ్చునని ఆశించడమైనది.
            భక్తి లక్ష్యం కోరికలు తీర్చుకోవడం కాదని, భగవంతుని అనుగ్రహం పొంది ఆయనతో హృదయగతమైన సాన్నిధ్యం పొందాలని ఈ సూత్రాలు తెలుపు తున్నాయి. ఈ విషయాన్ని ప్రధానంగా అందరికీ తెలియచేయాలనే సదుద్దేశమే యీ పుస్తక ప్రచురణకు ప్రస్తావన అయింది.
            సర్వమూ భగవంతుడు ఇచ్చినదే అయినప్పుడు మనం ఆయనకిచ్చేది మన దగ్గరేమున్నది ? కాని ఆయన కోసం ధనం, బంగారం మొదలగు వాటిని ఇచ్చే భక్తులను చూస్తున్నాం. నల్ల ధనాన్ని హుండీలో వేసే భక్తులను చూస్తున్నాం. అవినీతి సంపాదనతో భగవంతుని భాగస్వామిగా చేసుకొని మ్రొక్కు తీర్చుకునే భక్తులను చూస్తున్నాం. ఇదంతా భక్తి విషయంలో సరియైన అవగాహన లేకనేమో? ముక్తి కోసమే భక్తిగాని, వేరే కారణంతో కూడిన భక్తి భక్తి కాదని శాస్త్రం చెబుతున్నది. లేకపోతే అది భగవంతుని మనలాంటి వాడిగా భావించి చేసే వ్యాపారమవుతుంది. అయినా ఆయన వీటన్నింటికి జవాబు చెప్పేవాడు కాదు. చలించేవాడు కాదు. ఆయన నిర్వికారుడు. ఏదైనా ఆశించిన ఫలితం వస్తే, అది ప్రాప్తి ననుసరించి కర్మ ఫలంగా లభించేదేగాని, భగవంతుడు మనం కోరిన దానికి ఫలితంగా ఇచ్చింది కాదు.
            ఆయన ఎవరు చేసిన పుణ్య పాపాలకు తగిన ఫలితాన్ని వారికిస్తానని భగవద్గీతలో చెప్పాడు. కనుక ప్రాప్తి, అప్రాప్తి అనేవి సమత్వ దృష్టితో సర్వులకు నిర్ణయించబడినవే గాని, మ్రొక్కినందువలన ప్రాప్తించినవి కాదు. ఒక్కోసారి మ్రొక్కినందువల్లనే లభించినట్లు కనిపించినా అది అతడి ప్రాప్తిలో ఉండి ఉన్నది, మ్రొక్కక పోయినా లభించేదే. ఏమైనా అది భక్తుడి విశ్వాసం. ఏది ఏమైనా భక్తి అనే సత్కర్మ ఫలితంగా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అది ఆధ్యాత్మికమైన పురోగతి కలిగిస్తుంది గాని, భౌతికమైనవి అనుగ్రహించబడవు. ఆయనను సంతోష పెట్టడమంటే దైవేచ్ఛ ప్రకారం అవుననక, కాదనక జీవించడమే. మానవులను ప్రసన్నం చేసుకొనే సామ దాన భేద దండోపాయ మార్గాలేవీ భగవంతుని ప్రసన్నం చేసుకోవ డానికి పనికిరావు.
            నారద భక్తి సూత్రాలు అంటే అదొక భక్తి భావాన్ని స్థిరత్వం చెందించే శాస్త్రం. భగవంతుని పొందడం కోసమే భక్తి. భగవదైక్యానికి అడ్డుగా నిలిచిన అహంకారాన్ని తొలగించుకుంటే గాని భక్తి యొక్క లక్ష్యం నెరవేరదు, దీనినే సాధనగా చేసికొని క్రమక్రమంగా స్వార్థాన్ని తృప్తిపరచే గుణాలతో చేసే భక్తికి బదులుగా స్వార్థ రహితమైన, గుణరహితమైన భక్తిని అలవరచుకోవాలి.
            శుక మహర్షి భగవంతుని గురించి వివరిస్తున్నారు.
            పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సం
            హరణ క్రీడనుడై, త్రిశక్తి యుతుడై యంతర్గత జ్యోతియై
            పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
            స్తర మార్గంబున తేజరిల్లు హరికిం దత్వార్థినై మ్రొక్కెదన్‌ ! -భాగవతం

తా||  పరుడు, ఈశ్వరుడు, మహామహితుడు, సృష్టి స్థితి లయములనెడి లీలలను త్రిశక్తులతో కూడి చేసేవాడు, అంతర్జ్యోతి, పరమేష్ఠి, దేవతలచేత కూడా తెలియుటకు సాధ్యం కానివాడు, అట్టి హరిని తత్త్వంగా తెలియుటకు ప్రార్థిస్తున్నాను.
            శ్రీహరి తత్త్వం తెలియుటను లక్ష్యంగా చేసికొని, భక్తి శాస్త్రం (1) బాహ్య భక్తి (2) అనన్య భక్తి (3) ఏకాంత భక్తి అని క్రమసాధనను ప్రతిపాదిస్తున్నది. దీనినే మరొక విధంగా గౌణభక్తి, ముఖ్యభక్తి, పరాభక్తి అని అంచెలంచెలుగా శ్రీహరిని చేరుటకు వివరింపబడినది. మనం మాత్రం బాహ్య భక్తి అని చెప్పబడే నవవిధ భక్తి మార్గాలలో కొన్నింటిని మాత్రమే మనకు అనుకూలంగా, ఇష్టానుసారంలేక లక్ష్యాన్ని ఏర్పరచు కొనకుండానే, కాలక్షేపంగా మార్చుకొని చేస్తున్నాం. వీటిలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పూజనం, జపతపాదులు మొదలగు వాటిని అలవాటుగా ఏ లక్ష్యం  లేకుండా చేస్తూ ఉండిపోయాం. ఆపైన భగవంతుని అనుగ్రహం పొందగలిగిన సాధనకు పురోగమించడం లేదు.
            ఆ బాహ్య భక్తి కూడా క్రియాత్మకంగా కాయికంగానూ, వాచికం గానూ ఉంటున్నది గాని, అది మానసిక భక్తిగా మనలో పరిణమించడం లేదు.మన భక్తికి ఫలితం రావాలంటే అది మానసిక భక్తిగా మారిన తర్వాతనే వస్తుంది. ఆ ఫలితం భగవదనుగ్రహ రూపంలో ఉంటుంది. బాహ్య భక్తిలో ప్రధానంగా ఆడంబరాలకు చోటివ్వడం వలన అది మానసిక భక్తిగా మారడంలేదు. అందువలన మొదటగా భగవదనుగ్రహమే పొందడం లేదు. భగవదనుగ్రహం లేనిదే సాలోక్యాది ముక్తులు ప్రాప్తించడం కుదరదు.
            కనుక తెలియని వారికి విపులంగా తెలియజేయడమే కర్తవ్యంగా ఈ వ్యాఖ్యానం సాగుతుంది. తెలిసి కూడా ఆచరించని వారి సంగతి అప్రస్తుతం. విషయంగానైనా అందరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భక్తి మార్గాన్ని ఎంచుకొని దీనిని మోక్షమార్గంగా భావించే సాధకులకు మాత్రం ఈ వ్యాఖ్యానం కరదీపికగా ఉంటుందని ఆశించడమైనది. ఈ వ్యాఖ్యానంలో అనేక గ్రంథాలలోని విషయాలను సేకరించి సంకలనం చేయడమైనది. అందువలన ఆయా గ్రంథకర్తలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపడమైనది.
            ఏ గురువైతే ఈ గ్రంథ సంకలనానికి, వ్యాఖ్యానించడానికి ప్రేరణ, స్ఫూర్తి అందించారో ఆ గురువర్యుల చరణారవిందాలకు ప్రణామాలు.

            శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్‌ లోక ర
            క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్‌ దానవో
            ద్రేక స్తంభకు కేళీలోల విలస ద్దృగ్జాల సంభూత నా
            నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్‌ !
                        -భాగవతం

                                                                    బుధజన విధేయుడు,
                                                                          విజ్ఞాన స్వరూప్‌