30. స్వయం ఫలరూపతేతి బ్రహ్మ కుమారః

30. స్వయం ఫలరూపతేతి బ్రహ్మ కుమారః

            పరాభక్తి అనేది ఏ ఒక్క సాధనకుగాని, అన్ని సాధనలకు గాని ఫలంగా వచ్చేది కాదు. కార్యకారణంగా నిర్ణయించేది కాదు. దానికదే ఫలరూపం. ఇది బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి అభిప్రాయం.

            మరి సాధనలన్నీ దేని కొరకు ? అవన్నీ అజ్ఞాన నివృత్తి కోసం, గుణాలను లేకుండా చేసుకోవడానికి, అహంకారాన్ని అడ్డు తొలగించు కోవడానికి అవసరమౌతాయి. శాస్త్ర పఠనం వలన మ్షోం సిద్ధించదు. కాని శాస్త్రం వలన భగవంతుడెలాగుంటాడో ఎలా పొంద బడతాడో విషయంగా తెలుస్తుంది. సాధన ఎలా చెయ్యాలో ఉపాయా లేమిటో, లక్ష్యాన్ని ఎలా సమీపించాలో తెలుసుకోవడానికి పనికి వస్తుంది. అనగా సాధనల వలన భగవంతుని సమీపిస్తాం గాని, భగవదైక్యం జరుగదు. ఐక్యత అనేది భగవంతుని అనుగ్రహం లేక గురు కృపా విశేషం. మోక్షేచ్ఛ ఎంత తీవ్రతరమో, భగవదనుగ్రహం కూడా అంతే శీఘ్రంగా వర్షిస్తుంది.

            నిజానికి విచారిస్తే అది ఐక్యత కూడా కాదు. అది స్వతఃసిద్ధం. దాని సహజ స్థితి అజ్ఞానావరణ వలన తెలియలేదు గాని, ఆవరణ తొలగగానే తెలియబడింది. ఈ సహజ స్థితిని జీవుని స్థానం నుండి చెప్పవలసి వస్తే పొందేదిగా చెప్తున్నారు. భగవంతుని స్థితినుండి చెప్పవలసివస్తే అది ఎప్పుడూ ఉన్నదిగానే చెప్తున్నారు. సర్వ కాలాలలో, సర్వ దేశాలలో, సర్వ జీవులందు, స్వతః సిద్ధమయ్యే ఉన్నది ఆ సహజ స్థితి. సత్యవస్తువు గోచరించక పోవడం అంటే అజ్ఞానావరణం కారణంగా మరుగై ఉండటం. సాధనలన్నీ కూడా ఆ మరుగును తొలగించడానికే. మరుగు పోగానే ఉన్నదేదో ఉన్నది. అది ఆ సత్యవస్తువును సాక్షాత్కరింప చేస్తుంది. అంతేగాని అది క్రొత్తగా ఎక్కడి నుండో రాలేదు. అది మనలోనే ఉన్నది.

            విద్య అంటే ఉన్నది అని అర్థం. అనగా పరబ్రహ్మం. అవిద్య అంటే విద్య కానిది. అనగా లేనిది. కారణ కార్యాలకు అతీతమైనది ఆ పరబ్రహ్మం. కార్యకారణ సంబంధమైన ప్రపంచాన్ని అవిద్య లేక మాయ అంటారు. సత్యవిచారణ చేస్తే అవిద్య, లేక ప్రపంచం లేకుండా పోతుంది.


            దీనిని, అనగా పరబ్రహ్మను పరాభక్తి అని కూడా అంటారు. అందువలన పరాభక్తి అనేది స్వయంగా ఫలరూపం. అది సాధిస్తే, ఫలితంగా సాధ్యమయ్యేది కాదు.