19. నారదస్తు తదర్పితాఖిలాచరతా తద్విస్మరణే పరమ వ్యాకులతేతిచ

19.   నారదస్తు తదర్పితాఖిలాచరతా తద్విస్మరణే పరమ వ్యాకులతేతిచ

            సమస్త ఆచార వ్యవహారాలను భగవదర్పితం చేసిన భక్తుడికి భగవంతుడు ఎప్పుడైనా మరుపుకు వస్తే బాధపడుతుండడం భక్తి లక్షణం అవుతుంది. ఇది నారద మతం.

            పూజలు, కీర్తనలు వాటికవే భక్తి లక్షణాలు కావు. నిజమైన భక్తుడికి భగవద్విస్మృతి ఎన్నడూ కలుగదు. విస్మృతి ఎప్పుడైనా కలిగితే అందుకు దుఃఖపడతాడు. ఆ దుఃఖపడడంలో అతడు మరలా భగవంతునినే తలచు కుంటూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడూ నిలిచే ఉంటాడు.

            భగవంతుని మరువకుండా నిరంతరం స్మృతిలో ఉంచుకుంటే ఆయన కోసం స్తోత్రాలు చేయడం, మొదలైనవి అనవసరం. మొదట వాచిక భక్తి ఉన్నప్పటికీ భక్తుని చిత్తం భగవంతునికి అంకితమయ్యాక, పూర్వపు భక్తి విధానం అంత ముఖ్యం కాదు. మెహెర్‌బాబా తన భక్తులకు ఈ విధంగా చెప్పారు. ‘‘హారాలు వేయడం, మోకరిల్లడం, స్తోత్ర పాఠాలు వల్లించడం మొదలైనవి అనవసరం. భగవంతుని కనుగొనే మార్గంలో ప్రేమ, విధేయత, అర్పణ ఈ మూడూ ప్రధానం. మానవుడికి ప్రేమించడం తెలుసు. అది మానవుడికి భగవంతుడిచ్చిన కానుక. అయితే లోక సంబంధమైన వాటిని కాకుండా, అదే ప్రేమను భగవంతునిపై చూపడాన్ని సహజం చేసుకోవాలి. దానికోసం అర్పణ, లేక కైంకర్యం అనేది మానవుడు తిరిగి భగవంతునికి ఇవ్వవలసిన కానుక. భక్తుడు ప్రియతమ భగవంతుని ఇచ్ఛకు లోబడి ఆయనతో ఐక్యతను ఆశించాలి. ప్రేమ కన్నా విధేయత, విధేయతకన్నా అర్పణ గొప్పవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, విధేయత, అర్పణ - ఈ మూడూ కలిస్తే భగవత్ప్రేమ అవుతుంది’’.


            ఇట్టి ప్రేమలో ప్రేమికుడు ప్రియతముని ఒక్క క్షణం కూడా మరచి ఉండలేడు. ఒక వేళ మరచినా, పశ్చాత్తాపంతో మరలా ఆ భగవంతునినే నిలుపు కుంటాడు. నిరంతరం భగవద్ధ్యాసలోనే ఉంటాడు.