9. తస్మిన్న నన్యతా తద్విరోధి షూదాసీనతా చ

9. తస్మిన్న నన్యతా తద్విరోధి షూదాసీనతా చ

            పరాభక్తిలో సకల వ్యాపారాలు భగవత్కైంకర్యం జరుగగా, భక్తికి భిన్నంగా జరిగే పనులను ఉపేక్షా భావంతో చూస్తాడు. భగవదిచ్ఛే భక్తుడి ఇచ్ఛ అవుతుంది. భక్తుడి వ్యక్తిగత మనసు పనిచేయదు. అది దైవీ ప్రేరణతో నడుస్తుంది. పై సూత్రం లోని న్యాసానికున్న రెండు లక్షణాలను ఈ సూత్రంలో అనన్యత, ఉదాసీనతలను ప్రస్తావిస్తూ ఈశ్వరాయత్త చిత్తాన్ని కలిగియుండి వ్యవహరిస్తాడని పరాభక్తుడి గురించి చెప్తున్నారు. అనగా అతడి భావాలు భగవత్ప్రీతితో ఉంటాయి. ప్రపంచంతో బంధం ఉండక ఉదాసీనతతో ఉంటాడు.

            ఒకసారి భక్తుడిలో భగవంతుడు ప్రవేశించగానే, అతడి బుద్ధి భగవంతుడితో అనుసంధానం చెంది ఉంటుంది. అప్పుడు ఆ భగవంతుని కల్యాణ గుణాలే భక్తునిలో నిరంతరం చింతనారూపంలో ఉంటాయి. చిత్తం భగవద్దత్తం కాగానే అతడి ఇంద్రియాలకు కూడా ఆ భక్తి సోకుతుంది.

            జననము లేక కర్మముల జాడల బోక సమస్త చిత్త వ
            ర్తనుడగు చక్రికిం గవులుదార పదంబుల జన్మకర్మము
            ల్వి నుతులు సేయుచుండెదరు వేదరహస్యములందు నెందు జూ
            చిన మరిలేవు జీవునకు జెప్పిన కైవడి జన్మకర్మముల్‌
                                                                                   -భాగవతం

            వ్యాస భగవానుడు చెప్పుచున్నాడు. జన్మ కర్మలనేవి భగవంతుడికి లేవు. భగవంతుడంటే అజుడు, అవ్యయుడు, అంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వాత్మకుడు అని తెలియచేస్తున్నాడు. పరాభక్తుడన్నా, భగవంతుడన్నా ఒక్కటే. కనుక పరాభక్తుడికి జన్మ కర్మలు లేవు.

            రుక్మిణీ దేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రేమించడం వలన ఆమె ఇంద్రియాలకు కూడా ఆ భక్తి ఎలా సోకిందో చెప్తున్నది.

   సీ.       ఏ నీగుణములు కర్ణేంద్రియంబులు
                                    సోక దేహ తాపంబులు దీరిపోవు
            నేనీ శుభాకార మీక్షింప గన్నుల కఖిలార్థ
                                    లాభంబు కలుగుచుండు
            నేనీ చరణసేవ లేప్రొద్దు జేసిన
                                    భువనోన్నతత్వంబు బొందగలుగు
            నేనీ లసన్నామ మేప్రొద్దు భక్తితోడ
                                    విన బంధ సంతతులు వాయు

   తే.       నట్టి నీయందు నా చిత్త మనవరతము
            నచ్చి యున్నది నీ యాన నానలేదు.
            కరుణ జూడుము కంసారి ఖలవిదారి
            శ్రీయుతా కార మాననీ చిత్తచోర !

తా||  రుక్మిణీదేవి అంటున్నది. ఓ కంసారీ ! ఎట్టి నీ గుణాలు చెవులకు సోకగానే శరీర తాపాలన్నీ తీరిపోతాయో, ఏ మంగళకరమైన నీ శుభాకారం చూడగానే కన్నులకు సకల ఫలాలు సిద్ధిస్తాయో, ఏ నీ చరణ సేవ చేసి నంతనే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయో, ఏ నీ దివ్య మంగళ నామాన్ని భక్తితో స్మరించినంతటనే సకల బంధాలు వీడిపోవునో, అట్టి నీయందు నా చిత్తమెల్లప్పుడు నిలిచి ఉన్నది. ఈ నా స్థితిని నీ సాక్షిగా చెప్తున్నాను. నిజం సుమా ! స్త్రీ వంటి నా చపల చిత్తంలో భక్తి కలుగగానే నీవు నా పూర్వ చిత్తాన్ని దొంగిలించావు. ఓ శ్రీయుతాకారా! నాపై కరుణ చూపవా!


            ఇది రుక్మిణీదేవి పరమాత్మను ప్రార్థించిన విధం. ఇందులో భక్తి అనేది ఆమె జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు కూడా సోకి ఫలిత మిచ్చినట్లు లేదా ? తన్మయత్వంలో తననే మరువలేదా ?