6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి

6. యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి

            ఆ ప్రేమ స్వరూపం ఏ భక్తుడిని వరించిందో అతడు మత్తుడవు తాడు. స్తబ్ధుడవుతాడు. తనయందు తాను రమిస్తూ ఉంటాడు. అనగా ఆత్మారాముడవుతాడు.

      శ్లో||  అహమేవ పరం బ్రహ్మా బ్రహ్మాహాం పరమం మతమ్‌
            ఏవం సమీక్ష న్నాత్మాన మాత్మన్యాధాయ నిష్కలే
            దశంతం తక్షకం పాదేలేలిహానం విషాననైః
            నద్రక్ష్యసి శరీరంచ విశ్వంచ పృథగాత్మనః ||

తా||  నేను పరబ్రహ్మమే. బ్రహ్మమే నేననుట నామతం. సర్వమూ ఆత్మయే అని ఉండటం మాత్రమే సత్యం. కావున తక్షకుడూ లేడు, కరవడమూ లేదు, మరణమూ లేదు అని భాగవతం బోధించిన శుక మహర్షి తెలియ చేస్తున్నాడు. ఈ బోధ విన్న పరీక్షిత్‌ మహారాజు ఇలా అన్నాడు.

            భగవంస్తక్షకాదిభ్యో మృత్యుభ్యో నచిభేమ్యహం |
            ప్రవిష్ఠో బ్రహ్మనిర్వాణమ్‌ అభయం దర్శితంత్వయా ||

            అనగా స్వామీ ! నేను మృత్యువంటే భయపడను. మీ బోధచేత బ్రహ్మ నిర్వాణ స్థితిని పొంది, మరణ భయాన్ని పోగొట్టే అభయ స్థితిని పొందాను.

            భక్తి రసాన్ని గ్రోలిన భక్తుడు మకరందం గ్రోలిన తుమ్మెదవలె మత్తుడై మైమరచి విహరిస్తూ ఉంటాడు. భక్తి రసపానం చేసి మత్తుడైనవాడు ఇతరమైనటు వంటి దేనినీ కూడా భావించక, వాటి యెడల స్తబ్ధుడై ఉంటాడు. ఒక్కోసారి బాహ్యానికి సరిపడని ప్రవర్తనతో బాలునివలె, పిచ్చి వానివలె, పిశాచివలె కన్పిస్తాడు. ఒకసారి నవ్వుతాడు. మరోసారి ఏడుస్తాడు. ఇంకోసారి నృత్యం చేస్తాడు. అతడి ఆంతరంగిక వివశత్వ అనుభవం తెలియక, బయటి ప్రవర్తన మాత్రం చూస్తే, అతడి చేష్టలు మనకు అర్థం కావు.

            అతని నవ్వుకు కారణం తన భక్తికి భగవంతుడు తలవంచి, ఓడిపోయాడని. అలాగే భగవద్దర్శనం ఆలస్యమైనందుకు ఏడుస్తాడు. తన మొరనాలకించలేదని కుపితుడౌతాడు. దర్శనం కాగానే గంతులు వేసి, ఆనందంతో నృత్యం చేస్తాడు. భక్తి పారవశ్యంతో పాడుతాడు. ఈ చర్యలకు కారణం మనకు కనిపించదు. అందువలన మనకు అర్థం కాదు. ఆ బాహ్య చర్యలు ఆ భక్తుడికి కూడా తెలియవు. తన లోపలి అనుభవాన్ని బట్టి అసంకల్పితంగా బాహ్య చర్యలుంటాయి. అయితే అతడి ఆత్మారామత్వం అతడికి మాత్రమే అనుభవైక వేద్యం.

            పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు ఇట్టి పరిస్థితిలో ఎలాగుండెనో చూడండి.

   సీ.       వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై యొక్కడు నేడుచు, నొక్కచోట
            నశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడు, నొక్కచోట
            విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలినగుచుండు, నొక్కచోట
            నలినాక్షుడను నిధానము గంటి నేనని యుబ్బి గంతులువైచు, నొక్కచోట

   ఆ.       బలుకు, నొక్కచోట బరమేశు గేశవు
            బ్రణయ హర్షజనిత బాష్ప సలిల
            మిళితపులకుడై నిమీలిత నేత్రుడై
            యొక్కచోట నిలిచి యూరకుండు

తా||  ఆ ప్రహ్లాదాళ్వారు విష్ణుమూర్తి చింతనలో మునిగి చేష్టలుడిగిన వాడు. ఒక్కచోట ఒక్కడూ కూర్చుండి ఏడ్చేవాడు. నిర్విరామ శ్రీహరి చింతన చేయుచూ భగవదావేశపరుడై గొంతెత్తి గానం చేసేవాడు. వేరొక చోట అంతా విష్ణుమయమే గాని, ఇతరమేమీ లేదని నిర్ణయంచేసి నవ్వేవాడు. ఇంకొకచోట పద్మాక్షుడనే పెన్నిధిని కనుగొంటినని పొంగి గంతులు వేసేవాడు. మరొకచోట పరమేశ్వరుడైన కేశవునితో స్వగతంగా మాట్లాడు చుండేవాడు. మరొకచోట ఆ భక్తి చిత్తుడు ప్రేమ పూరిత భక్తి పారవశ్యంలో మైమరచి ఆనంద బాష్పాలు రాల్చేవాడు. పులకించిపోతూ నిమీలిత నేత్రుడై నిల్చొని ఉండేవాడు.        
            రాక్షసరాజు కుమారుడైనప్పటికీ, రాక్షస బాలుర సాంగత్య మున్నప్పటికీ, రాక్షస గురుని వద్ద విద్యనభ్యసించినప్పటికీ ఆ ప్రహ్లాదుడు మాత్రం ఈ విధమైన హరి భక్తుడగుట ఆతని పూర్వజన్మ సుకృతమై ఉండును.

            బ్రహ్మభూతః ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి |
            సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ||
                                                                            - భగవద్గీత

తా||  సచ్చిదానంద పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్కుడైన యోగి దేనికినీ శోకించడు. దేనినీ ఆశించడు. సమస్త ప్రాణులందు సమభావంగల అట్టి యోగి ఆ పరాభక్తిని పొందుతాడు.

            ముందు సూత్రంలో ‘‘ప్రాప్య’’ అన్నప్పుడు ప్రాపక ప్రాప్య భావాన్ని, ఈ సూత్రంలో ‘‘జ్ఞాత్వా’’ అన్నప్పుడు జ్ఞానజ్ఞేయ భావాన్ని సూచిస్తూ ముందు సూత్రంలో వృత్తి వ్యాపారాన్ని, ఈ సూత్రంలో వృత్తి స్థంభనను సూచిస్తున్నదని గ్రహించాలి. ఇలా ఏకాంత భక్తిలో భక్తి జ్ఞానాదులకు భేదం లేదు.

            1) భక్తితో మనసు ద్రవీభూతమై ప్రేమాకారాన్ని దాలుస్తుంది. బ్రహ్మ విద్యలో మనసు ద్రవీభూతం కాదు. అది ఏకాగ్ర వృత్తిలో అవ్యక్తంలో నెలకొంటుంది.

            2)  భక్తిలో మనసు సవికల్పమై ఉంటుంది. బ్రహ్మ విద్యలో అది నిర్వికల్పం.

            3)  భక్తికి భగవల్లీలా విశేష జ్ఞానం సాధనమవుతుంది. బ్రహ్మ విద్యయందు తత్త్వమసి వంటి ఉపనిషద్వాక్య జ్ఞానం సాధనమవుతుంది.

            4) భక్తికి భగవత్ప్రీతి ఫలమవుతుంది. బ్రహ్మ విద్యకు అజ్ఞాన నాశనం ఫలమవుతుంది.

            5) భక్తిలో ప్రాణికోటి యావత్తుకు అధికారం ఉంది. బ్రహ్మ విద్యకు సాధన చతుష్టయ సంపత్తి కలవాడే అధికారి.

            భక్తిలో గాని, బ్రహ్మ విద్యలో గాని పై విధమైన భేదమంతా సాధన క్రమ సంబంధమేగాని, అనుభూతి సంబంధం కాదు. అందువలన సాధకులు వారికి ప్రీతికరమైన ఏదో ఒక మార్గంలో సాధన చేసి పరమావధి పొంద వచ్చును. ఈ రెండు మార్గాలలో హెచ్చు తగ్గులు లేవు. కావలసింది మాత్రం శ్రద్ధతో కూడిన సాధన, మోక్షగమ్యంపై లక్షించడం. భక్తి ద్వారా భగవంతునికి సమర్పణ అవుతూ అహంకార మమకారాల అడ్డు తొలగించుకోవడం జరుగుతుంది. బ్రహ్మ విద్య సాధనతో కూడా అనాత్మ భావన పోతే శేషించేది ఆత్మ తత్త్వమే. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసినదేమంటే భక్తి సూత్రాలను అర్థం చేసుకొని ఆచరిస్తే ఈ భక్తి మార్గం ఇతరమైన వాటికంటే తక్కువేమీ కాదు.

            ‘‘మత్తః’’ అంటూ ఈశ్వరేచ్ఛయందు ఉన్మత్తమగుట. ‘‘స్తబ్ధః’’ అంటే నైష్కర్మ్యమని అర్థం. ‘‘ఆత్మారామః’’ అంటే భక్తుడు భగవంతునియందు తదేక పరాయణత్వమని అర్థం. అనగా ధర్మ విరుద్ధం కాని వ్యాపారంతో ఈశ్వరేచ్ఛ ననుసరించి ఉంటాడని నిర్ణయం.