4. యల్లబ్ధ్వా పుమాన్‌ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి

4.     యల్లబ్ధ్వా పుమాన్‌ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి

            పరమప్రేమ స్వరూపం, అమృత స్వరూపం అయినట్టి ఈ భక్తిని సాధించిన పురుషుడు సిద్ధ పురుషుడగును, అమరుడగును, తృప్తుడగును.

            పురుషుడనగా దేహం అనే పురంలో నివసించే దేహి. దేహానికే స్త్రీ, పురుష లింగ భేదం గాని, దేహి ఎప్పుడూ పురుషుడే. అనగా ప్రకృతి కంటే విలక్షణుడు, ఆ ప్రకృతికి ఆధారం. భక్తుని యందున్న పురుషుడే ఆత్మ. భగవంతునియందున్న పురుషుడు కూడా అదే అఖండాత్మ. ఈ ఆత్మ దేహమందున్నప్పుడు ''నేను''గా తోస్తుంది. నేను అనే భక్తుడు పరవశించి, మైమరచి, భగవంతునితో కలసి ఏకాత్మగా ఉన్నప్పుడు ఆత్మాను భవం పొందుచున్నాడు.

            భక్తుడు భగవత్ప్రేమ అనే సాగరంలో మునిగి తేలుతూ తదేక భావంతో ఉండిపోతాడు. ఇక ఏ ఇతర భావాలూ అతనిలో కలుగవు. అందువలన ఆ భక్తుడు ఆత్మానందుడవుతాడు. జీవ భావాన్ని విడచిపెట్టి నిత్యతృప్తుడౌతాడు.

            సిద్ధుడు అంటే సాధన చేత క్రొత్తగా తృప్తి పొందినవాడు కాదు. సర్వకాల సర్వావస్థలందు అదే అమృత స్వరూపుడై, తృప్తుడై ఉన్నాడు. అజ్ఞాన వశం చేత దానిని మరిచాడు. అంతే ! జ్ఞానోదయం అయ్యే వరకు లేదని, ఇప్పుడయ్యాడని అనడం సబబు కాదు. జరిగిందేమిటంటే భక్తివలన, భగవంతుని సాహచర్యంలో మునిగి, తన అజ్ఞానావృత శరీర భావాన్ని విడచిపెట్టాడు. అందువలన తనదే అయినట్టి నిత్యానందాన్ని తిరిగి చవిచూశాడు. మొదట ఉన్నది మరపులో తెలియలేదు గాని, నిజానికి అప్పుడూ ఉన్నది. భక్తి పారవశ్యంలో మరపును వదలడం ద్వారా పొందినట్లు చెప్పినప్పటికీ, తనదే తనకు గుర్తు వచ్చి తన నిత్యానందాను భవంతో తృప్తుడైనాడు. దీనినే సిద్ధత్వం అంటారు.

            ఇది అష్టసిద్ధులు కలిగినటువంటి సిద్ధత్వం కాదు. భగవంతునిలో చేరి, భగవంతుడే అయినట్టి పునరనుభూతియే సిద్ధత్వం. ''అమృతస్య పుత్రా'' అంటుంది వేదం. మనం దేవుని ప్రతిరూపంగా సృష్టించబడ్డాం. అందువలన ఆయన లక్షణాలే మనలో కూడా ఉన్నాయి. అవేమంటే పరిపూర్ణత, శాశ్వతత్వం. ఇవి నిత్యానందాన్ని కలుగజేస్తాయి. అజ్ఞానమనే ముసుగులో ఉన్నప్పటికీ మనం మన సహజ లక్షణాన్ని మాత్రం విడువలేదు. అందుకే మనం ఆయన కొరకు అన్వేషించి ఆయనతో ఒక్కటయ్యేందుకు తపన పడుతున్నాం. ఆవరణ వలన ఆనంద స్వరూపుడైన ఆయన కోసం చేసే అన్వేషణ ప్రియం, మోదం, ప్రమోదమనే పద్ధతిలో బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది. ఎప్పుడో ఒకరోజు తన నిత్యానందాన్ని తనలోనే కనుగొంటాడు. అందువలన మనకు తెలియకుండానే భగవదైక్యం ద్వారా సహజానందం సిద్ధింప చేసుకోవడానికి పురోగమిస్తూనే ఉన్నాం. కనుక దివ్య జ్ఞాన సముపార్జన మానవుని జన్మహక్కు. ప్రేమ ద్వారా భగవంతుని చేరి ఆయనతో ఐక్యం కావడం మన జీవిత ధ్యేయంగా ఉంది. ఆ విషయం తెలిసి, భక్తిని ఆచరిస్తే సఫలీకృతమవుతాం.

            ఆత్మకు, శరీరేంద్రియాలకు అనుసంధానమై ఉన్న పురుషుడే ''నేను'' అనే జీవుడు. ఈ ''నేను'' శరీర తాదాత్మ్యతను విడచుటకు, ఆత్మతో అనుసంధానం చేసుకొనుటకు సాధన చేయాలి. దీనికోసం తాను శరీరం కాదనే విషయాన్ని విచారణ చేయడం ద్వారా నిర్ణయించుకొని ప్రాపంచిక విషయాలందు వైరాగ్యం చెందాలి. తాను ఆత్మ అనే నిజాన్ని ఋజువు చేసుకొని భక్తి ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి. తుదకు ఆయనతో కలసిపోవడమే అనుష్ఠానం. దీని కొరకు భక్తిని సాధనగాను అనుష్ఠానంగాను, తీసుకొని ముఖ్యభక్తిగా మార్పు చెందించు కోవాలి. అప్పటి వరకు చేసే భక్తి క్రియలన్నీ బాహ్య భక్తి క్రిందకు వస్తాయి. ఈ భక్తి అనన్య భక్తిగా, ఏకాంత భక్తిగా పరిణమించవలసి ఉన్నది. ఇంతవరకు చేసే సాధనను అపరభక్తి అంటారు. సాధన ఫలితంగా ముఖ్యభక్తి కలుగుతుంది. దృఢమైన ముఖ్యభక్తినే పరాభక్తి అంటారు. పర్యవసానమైన సిద్ధ వస్తువే పరాభక్తి అవుతుంది.

శ్లో||  యం లభ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ||
-భగవద్గీత

తా||  దేనిని పొందితే మరి ఏ ఇతర లాభాన్ని అధికంగా పరిగణించరో దానిని పొందాలి. అదే పరాభక్తి. దీనినే ముక్తి అంటారు.