31. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్‌

31. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్‌

            పరాభక్తి అనేది స్వయంగా ఫలరూపం అనడానికి (1) రాజు (2) గృహం (3) భోజనం అనే విషయాలను ఉదాహరణగా చెప్తున్నారు. (1) ఒక రాజుకు కొడుకు పుట్టాడు. ఎవరో దొంగలు ఆ శిశువును అపహరించు కొని వెళ్ళగా, ఒకడు రక్షించి సన్యాసి వద్దకు చేర్చాడు. అక్కడ ఆ శిశువు సన్యాసి బిడ్డగా పెరిగి, పెద్దవాడయ్యాడు. ఒకనాడు ఇతడికి తాను రాజకుమారుడని తెలిసి, రాజువద్దకు చేరి సుఖించాడు.

            తాను రాజకుమారుడననే జ్ఞానం కలుగగానే అతడు తెలుసు కున్నప్పటి నుండియే రాజకుమారుడా ? అంతకు ముందు రాజకుమారుడు కాదా ? ఏది సత్యం ? అజ్ఞాన కారణంగా కొంతకాలం నేను సన్యాసి కుమారుడను అని అనుకున్నంత మాత్రాన అతడు నిజానికి సన్యాసి బిడ్డ కాదు కదా ! అతడు పుట్టుకతోనే రాజకుమారుడనేదే సత్యం కదా ! అయితే ఆ సత్యం అతని భ్రాంతి వదలగానే తెలిసింది. తెలియడంలో జాప్యమే గాని, సన్యాసి బిడ్డ రాజకుమారుడుగా మారలేదు కదా ! రాజకుమారుడనేది కొంతకాలం మరుగున పడ్డది. అతడికి తాను రాజకుమారుడనే సత్యం తెలిసినా తెలియకపోయినా అతడు రాజ కుమారుడేగా! సన్యాసికి పుట్టలేదు కదా !

            అలాగే తాను భగవంతుడు అనేది సత్యం. భక్తుడనేది మరుపు. తిరిగి పరాభక్తి సిద్ధించగానే తాను మునుపటి నుంచే భగవంతుడనేది సత్యంగా గోచరించింది. దీనినే ‘‘అహంబ్రహ్మాస్మి’’ అనే జ్ఞానం అంటున్నాం. తాను భగవంతుడు కాదనుకొనేది అజ్ఞానం.

            అజ్ఞాన జ్ఞాన భేదమే గాని, భక్తుడు నిజానికి ఆ సనాతన పురుషుడైన భగవంతుడే. అందువలన భక్తుడు భగవంతుడయ్యాడని గాని, ఆ భక్తుడు భగవంతుడిలో ఐక్యమయ్యాడని గాని అనరాదు. కాని సాధన పూర్తై మరుపు విడిచేదాకా అలా అనడం జరుగవచ్చు. ఎందుకంటె అజ్ఞానిగా ఉన్న సన్యాసి బిడ్డ తాను రాజకుమారుడని తెలియనప్పుడు రాజు వద్దకు వెళితే ఆ రాజు అతడిని యువరాజుగా చేస్తే ఏమనుకుంటాడు ? అది అతని అదృష్టంగా భావిస్తాడు. అదే జ్ఞాని అయిన సన్యాసి బిడ్డ, తాను రాజకుమారుడని తెలిసి, యువరాజైతే ఏమనుకుంటాడు ? అది తన హక్కు అనుకుంటాడు. అలాగే భక్తుడు భగవంతుడే గనుక, ఆ భక్తుడు భగవంతుడే అనే జ్ఞానం కలిగినంతనే అది అతడి హక్కు అయిపోయింది. అది అదృష్టం కాదు.

            2) ఒక గృహస్థుడు స్వగృహంలో సుఖంగా ఉండేవాడు. ఒక రోజున స్వగృహం విడచి దేశాంతరం వెళ్ళి, చాలా సంవత్సరాలు అనేక మజిలీలలో మకాం వేస్తూ తిరిగాడు. కొన్ని చోట్ల ఇబ్బందులతో గడిపాడు. మరికొన్ని చోట్ల సంతోషంగాను, వినోదంగానూ గడిపాడు. ఏమైనా గాని, ఆ అనుభవాలమధ్య స్వగృహంలో ఉన్న తృప్తిని మరిచాడు. చివరకు అతడు తన స్వగృహం చేరాడు. అక్కడ తృప్తిగా హాయిగా ఉన్నాడు. మునుపటివలె అనగా అంతకుముందు తను స్వగృహంలో ఉన్నప్పటివలె, తిరిగి అదే తృప్తితో ఉన్నాడు. ఈ విధమైన స్వగృహంలో ఉన్నప్పటి తృప్తి దేశాటన తర్వాత తిరిగి లభించిన తృప్తి ఒక్కటే గాని, ఈ రెండవసారి కల్గిన తృప్తి కొత్తగా వచ్చింది కాదు. ఆ పాత తృప్తే కొంతకాలం వేరే అనుభవాల మధ్య మరుగునపడి, తిరిగి కలిగింది. అంతేగాని, ఇప్పటి స్వగృహ తృప్తి కొత్తది కాదు. బయట ఎంత సుఖంగా, వినోదంగా గడిపినప్పటికీ అది స్వగృహంలో ఉన్నప్పుడుండే సహజత్వం వలన కలిగే తృప్తితో సాటికాదు. దేశాటన పిదప, స్వగృహ నివాసం వలన కలిగిన తృప్తి, సంతోషం సిద్ధ వస్తువు. అనగా నూతనంగా సంపాదించినది కాదు. కనుక పరాభక్తి కూడా సిద్ధ వస్తువే. ఎందుకంటే తాను తానైనదే తిరిగి అనుభవంలోకి వచ్చిన భగవత్స్వరూపం. కొంతకాలం మరుగునపడి ఇప్పుడు సిద్ధించింది.

మరచితి నా మందిరంబు - పాట
            ||    మరచితి నా మందిరంబు
            మరచిపోయితీ - మందిరంబు                     ||||
            సచ్చిదానంద పరహ్మ్రమనెడి మందిరంబు        ||||
1          పసితనమునె పుడమికినొక
            పనిమీదను పయనమైతి
            యవ్వన ప్రకృతి సుందరి
            నవ్వుల సిరిమోము జూచి
            మమతల తీయని మాటల
            మాయా మోహిని వశమై
            ఇల, అనుభవముల సుందరి
            చెలియాండ్రతో ఆటలాడి                                      ||||
2         ఆటల ఆనందములో
            ఆలస్యంబాయె మెహెర్‌ !
      ఆనందపు నాదు పవలు
            అస్తమించి చీకటిపడె
            నల్లని దుఃఖపు రాతిరి
            నలుకెలంకులను గ్రమ్మెను
            చంచల మనసున దుఃఖిత
            చపలుడనై తిరుగుచు నే                                       ||||
3         ఎంతదూర మున్నదో
            ఎరుగను నా ప్రేమయిల్లు
            ఇంటిమీద కలిగె దీక్ష
            కంటిమీద కునుకు బోయె
            జనన, మరణ, జన్మలనెడి
            తనువు మజిలి పవలురేలు
            గడచిపోవుచుండెనో
            కడయెరుగని దిగులుతోడ                                  ||||
4         దివ్యప్రేమ, జ్ఞాన, శక్తి
            దీప్తులనిడు మందిరంబు
            చేర, పరుగులిడుచుండగ
            కరుణతో పరదేశియొకడు
            భయపడకిలు జేర్చెదనని
            బాసజేసెనో బాబా !
            మజిలీలిక ఎన్ని జరుగు ?
            మందిరమిక ఎంతదవ్వు ?
            అనురాగీ భాస్కరుడు
            వినయంబున వేడుకుండె
            ఎన్నాళ్ళకు ఇలుజేరెద
            ఎరిగింపుమో మెహెరు బాబా !                                       ||||

రచన : శ్రీ బాలగోపాల భాస్కరరాజు

                                  (మెహెర్‌ బాబా భక్తుడు)

            3) ఆకలి వేసినవాడికి అన్నం పెట్టినప్పుడు ఆకలి బాధ తీరుతున్నది. కాని మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ అన్నం తింటే మళ్ళీ ఆకలి బాధ తీరుతుంది. ఇలా అనేక మారులు ఆకలి బాధ తీరినప్పుడు తృప్తి కలుగుతూనే ఉంటుంది. ఇట్టి తృప్తి ఒక్కటే కాదా ! మధ్యలో ఆకలి వేసినప్పుడు మరుగున పడి, ఆకలి తీరగానే తిరిగి అదే తృప్తి కలిగి హాయినిస్తున్నది. ఈ సంతృప్తి  సిద్ధ వస్తువు. అలాగే ఆత్మానందుడు జీవ భావం కలిగినందువలన బాధలు పడుతూ, ఆ జీవ భావం పోగానే ఆత్మానందుడవుతున్నాడు. కాని ఆత్మానందమే సహజం, శాశ్వతం. అది జీవ భావంలో మరపులో ఉంది. మరుపు పోగానే, ఉన్నదే ఉన్నది గాని, కొత్తగా ఏమీ రాలేదు. మరుపు అనే అజ్ఞానం తొలగిపోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం కోసం స్వరూపాను సంధానం చేయాలి. జ్ఞానం అంటే స్వస్వరూపంగా ఉండి పోవడమే. స్వస్వరూపం ఆది అంతం లేనిది, కనుక అది ప్రాప్తించేది కాదు. అది స్వతస్సిద్ధం. అదే పరాభక్తి.