28. తస్యాః జ్ఞానమేవ సాధన మిత్యేకే

28. తస్యాః జ్ఞానమేవ సాధన మిత్యేకే

            జ్ఞానం వల్లనే మోక్షమని కొందరి అభిప్రాయం. అది నిజమే. ఏది సాధించాలన్నా దాని పూర్వాపరాలు తెలియాలి. పెద్దల అనుభవంతో వ్రాయబడిన తత్సంబంధ శాస్త్రాలు పఠించాలి. సాధనలకు తగిన ఉపాయం తోచాలి. ఇదంతా జ్ఞానమే కదా ! అంతేకాదు ఆ వస్తువు మనకు అవసరమా? కాదా ? లేక ఎవరైనా సరే తప్పక సాధించవలసిన అవసర ముంటుందా ? ఇవన్నీ తెలిపేదే జ్ఞానం. ఇలాంటి ప్రశ్నలను అనుబంధ చతుష్టయంగా వేదాంతం చెబుతుంది.

            (1) విషయం (2) సంబంధం (3) ప్రయోజనం (4) అధికారి

            ఇక్కడ విషయం అంటే భక్తి విషయం. దీని లక్ష్యంగా భగవదను భూతి సిద్ధిస్తుంది. సంబంధం అంటే మానవులందరికీ సంబంధించిందే ఈ భక్తి విషయం. అయితే మాత్రం, భక్తి సాధన చేయవలసిన అవసరమేమున్నది ? ప్రయోజన మున్నది గనుక చేయాలి. ఆ ప్రయోజనం వద్దనుకుంటే మరిన్ని జన్మలలో తిరు గాడుతూ కష్టాలు, బాధలు, వ్యాధులు, దరిద్రం, వృద్ధాప్య బాధలు, మరణ  బాధ, గర్భస్థ నరకం మొదలగునవి తప్పవు. వీటినుండి విముక్తి కావటమే ప్రయోజనం. భగవంతుని చిన్న చిన్న కోరికలను తీర్చమని అడగటం కంటే ఆయనలో ఐక్యత చెందేటందుకు  ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని కోరడం ప్రయోజనం కదా !

            భక్తి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించాక  దీనికి మానవు లందరూ అర్హులే. అహంకారాదుల అడ్డు తొలగితేగాని భగవదనుగ్రహం లభించదు గనుక, కొంత ముందస్తు సాధన చేయవలసి ఉంటుంది. అవే శమదమాదులు, యమ నియమాదులు. వీటిని సంపాదించినవాడు భక్తి మార్గంలో ప్రవేశించడానికి అధికారి. అయితే బాహ్యభక్తిని వెంటనే ఆరంభించవచ్చును. క్రమంగా అధికారి అయిునవాడు గౌణభక్తిని ముఖ్య భక్తిగా మార్చుకొనగలుగుతాడు. గమ్యమైనట్టి పరాభక్తిని సిద్ధింపచేసు కొంటాడు. యోగం కూడా అభ్యాసమైతే భగవదనుభూతి చెందడం తేలికవుతుంది. అంగన్యాస, కరన్యాస, హృదయన్యాస పూర్వకమైన అనుష్ఠానం కూడా పరాభక్తి లక్ష్యంగా చేయవచ్చును. ఆ భగవంతుడిని తన అంగాంగాలయందు భావిస్తూ చివరకు ఏకమొత్తంగా తానే భగవంతుడనే యోగం కలిగితే అదీ యోగ్యతే.


            నారద మహర్షి ప్రకారం భక్తి ప్రధానంగా చేసుకొని జ్ఞానం, యోగం సహాయంగా ఉండాలని నిర్ణయం.