25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యోఽప్యధికతరా

25.   సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా

            ఇప్పటిదాకా పరాభక్తి లక్షణం గురించి వివరించడమైనది. ఇక పరాభక్తి యొక్క గొప్పతనం (మహత్వం) తెలుపుచున్నారు. ఈ పరాభక్తి కర్మ, జ్ఞాన యోగాలు మూడింటికంటె గొప్ప ఫలసిద్ధిగా ఉన్నది.

            జ్ఞాన యోగంలో నిత్యానిత్య వస్తు వివేచనా శక్తి, దానితో ఆత్మానాత్మ వివేకం బాగా పనిచేస్తుంది. కర్మ యోగంలో లౌకిక పదార్థాల మీద ఇచ్ఛను నిగ్రహించి, కర్మలు చేయడంలో నేను, నాది అనే వాటిని లేకుండా చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. భక్తి యోగంలో భగవంతుడిని ఆయన కల్యాణ గుణాలను కీర్తిస్తూ, అవతారుల సచ్ఛరిత్రలను చదువుతూ వారి లీలలను వింటూ మననం చేస్తూ, గానం చేస్తూ పరవశించడం ద్వారా నేను, నాది నుండి దూరమౌతారు.

            యోగమేదైనా అనుభవం ఒక్కటే. సచ్చిదానందానుభవమే మోక్షమని అద్వైతం, పరమప్రేమ రూపమే మోక్షమని రామానుజ మతం, రాధాకృష్ణుల ప్రేమైక్యతయే మోక్షమని చైతన్యమతం చెప్తున్నాయి.

            సాధక జనులను పెద్దలు మూడు తరగతులుగా విభజన చేశారు. (1) హృదయ ప్రధానులు అనగా ఆవేశానుభూతిపరులు. వీరికి భక్తి మార్గం చూపబడినది. (2) బుద్ధి ప్రధానులు. అనగా కేవలం వివేకి అగు మానవులు. వీరికి వివేచనా పూర్వకమైన జ్ఞాన మార్గం చూపబడినది. (3) హృదయ, బుద్ధి ప్రధానులు. అనగా చురుకైనవారు. వీరు హృదయపు విలువలకు, బుద్ధి సూత్రాలకు మధ్య ఊగులాడుతూ ఉంటారు. ఇట్టి సమ్మిళిత ప్రవృత్తి కలవారికి నిష్కామకర్మ యోగ మార్గం చూపబడింది.

            అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. ఇది ఎక్కువ మందికి సాధ్యంగా కనిపిస్తుంది. గమ్యమైన మోక్షం అన్ని యోగాలలో ఒక్కటే అయినా సాధన మార్గాలు భిన్నం. ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరికి కష్టమైతే, మరొక్కరికి సులభం అనిపిస్తుంది. భక్తిమార్గం మాత్రం సాధనలోకి వెంటనే ప్రవేశించడం వరకు అందరకూ తేలికే. సాధన విషయానికి వస్తే అన్ని మార్గాలలోనూ అహంకార, మమకారాలను విడచిపెట్టి సంసార బంధం నుంచి విముక్తి పొందడం తప్పనిసరి. మోక్షం అనేది సాధనకు ఫలం కాదు. సాధనకు ఫలం బంధ విముక్తి.

            బంధ విముక్తికై వారి వారి జన్మాంతర సంస్కారాలను బట్టి కొందరు జ్ఞానమార్గంలోను, మరికొందరు భక్తి మార్గంలోను, ఇంకా కొందరు యోగ మార్గం లోను సాధన చేస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టమైనది వారికి సులభం. ఇష్టం కానిది కష్టం. వీటిలో ఏది గొప్ప మార్గమో నిర్ణయించడం కష్టం.

            పాతంజలి యోగమార్గం చిత్త వృత్తి నిరోధమే ప్రధానమంటుంది. ఇక్కడ బ్రహ్మానందానికి బదులు శూన్యత ఏర్పడుతుంది. దీనిని తమః ప్రధాన సమాధి అని కొందరు అంటారు. కపిలుని సాంఖ్యం నిత్యమైన ఆత్మయే తానని, అనిత్యమైన దేహేంద్రియాలు తాను కాదని నిర్ణయిస్తుంది. తద్వారా పరోక్ష జ్ఞానం, పాండిత్యం కలుగుతాయి గాని, అపరోక్షానుభూతి కష్టతరమవుతుంది.           

            భక్తి మార్గమైతే అందరికీ అందుబాటులో ఉండి అవగాహన అవుతుంది. హృదయమంతా భగవంతునితో నింపుకోగలిగితే, పారవశ్యంలో దేహాదులను మరిస్తే, భక్తుడు గమ్యం చేరవచ్చు.

            అయితే మూడు మార్గాలలో ప్రతి ఒక్క దానికి, ఇతర రెండు మార్గాల సహాయం అవసరమవుతుంది. ఎలాగంటే తత్త్వ విచారణ చేసిన వారికి యోగబలం కూడా ఉంటేనే గాని అపరోక్షానుభూతి కలుగదు. ఇష్టదైవ భక్తికి బదులు గురు భక్తి తీవ్రంగా ఉంటేనే గాని జ్ఞానం సిద్ధించదు. దీనికి చతుర్విధ గురు శుశ్రూషలు చేయాలి. అవి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావశుశ్రూష, ఆత్మ శుశ్రూష అని నాలుగు విధాలు. ఈ శుశ్రూషలను బాహ్యార్థంతో గాక అంతరార్థంతో చేయాలి. గురువంటే సాక్షాత్‌ పరబ్రహ్మ అని తెలియాలి. ఎంత చేసినా, భక్తిలో కలిగే విధంగా ఇతర మార్గాలలో పారవశ్యం లభించదు. దీనికోసం యోగబలం అవసర మవుతుంది. భక్తి కూడా ప్రధానంగా ఉన్నప్పుడే అపరోక్షానుభూతి కలుగుతుంది. ముందుగా దైవభక్తిలో నిష్ణాతులైన వారే గురు భక్తిలో కుదురుకొనగలరు.

            యోగాభ్యాసం చేసేవారికి మార్గదర్శకులైన గురువు దొరకాలి. అయినా యోగి స్వప్రయత్నంతోనే యోగ సాధన చేయాలి. అది యోగా భ్యాసకుడి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. సమాధి స్థితులలో సవితర్క  సమాధితోనో, సవిచార సమాధితోనో ఆగిపోతారు. దీనిని రజః ప్రధాన సమాధి అని కొందరు అంటారు.

            ఇక్కడ తర్కం, విచారణ అనేవి జ్ఞాన మార్గంలో లభించేవి. ఈ రెండింటి ఫలం ఆనందం. ఫలితంగా వచ్చే సానంద సమాధి సిద్ధ వస్తువు కానందున అది మోక్షం కాదు. పైగా చిత్త వృత్తి నిరోధమైతే వచ్చే ప్రశాంతతను ఆత్మానందమని పొరబడతారు. ఆందోళన కలిగించే వృత్తులు ఆగిపోవడం వలన లభించే ప్రశాంతతను అనుభవిస్తారే గాని, ఆ శూన్యంలో స్వరూప చైతన్యానుభవాన్ని గుర్తించలేరు. కొందరికి ప్రజ్ఞాత సమాధి కలిగి సూక్ష్మ ప్రపంచానుభవాలు వస్తాయి. అది మోక్షం కాదు. దృశ్యాలు, శబ్దాలువస్తే కూడా అది మోక్షం కాదు. కొందరు వాటిని భగవత్సా క్షాత్కారంగా భావిస్తారు. ఇవన్నీ సాధకుని ప్రజ్ఞలో కలిగే అనుభవాలు గనుక ప్రజ్ఞాత సమాధులంటారు. ఇవన్నీ సవికల్పమే గాని నిర్వికల్పం కాదు. మోక్షమంటే సహజ నిర్వికల్ప సమాధి లేక అసంప్రజ్ఞాత సమాధి.  దీనిని సత్వప్రధాన సమాధి అని కొందరు అంటారు. దైవభక్తి ఉండి, దైవమంటే ఏమో తెలుసుకున్న జ్ఞానులకు యోగమార్గం సులభం. చిత్తవృత్తులాగిన స్థితిలో జడత్వానికి బదులు స్వీయ చైతన్యానుభవం కలగాలంటే ఇతర మార్గాల సహాయం అవసరమవుతుంది. స్వామి వివేకానందుల వారిలా అన్నారు. ‘‘భక్తి లేని వేదాంతం వెఱ్ఱియే. వేదాంతం లేని భక్తి మూఢ నమ్మకం మాత్రమే’’.

            భక్తి విషయంలో జ్ఞానం లోపిస్తే అది గౌణభక్తిగా, లేక బాహ్య భక్తిగానే ఉండిపోతుంది. ముఖ్యభక్తిగా మారదు. భక్తి సాధకులు అహం కారాదుల ప్రతి బంధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన జ్ఞాన సముపార్జన చేయాలి. లేకపోతే బాహ్య భక్తిలో వినోదిస్తూ కాలక్షేపం చేస్తారు.  వీరికి పరాభక్తి సిద్ధించదు. సాధన చతుష్టయ సంపత్తిలో భాగంగా వివేక వైరాగ్యాలు, శమించడం, దమించడం, ద్వంద్వ రూప ప్రపంచంలో సమదృష్టి మొదలైనవి తెలుసుకుని ఆచరించాలి. అప్పుడే భక్తి సాఫల్యమవుతుంది.

            వీనిని బట్టి తేలిందేమంటే ఏ ఒక్క మార్గం అవలంబించినా ఇతర మార్గాల సహాయం తీసుకొనవలసిన అవసరముంటున్నది. అందువలన ఏది గొప్ప మార్గమనే దానిని అందరికీ సరిపోయేటట్లు నిర్ణయం చేయలేము.

            శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో నిరాకార బ్రహ్మంను సేవించడం కంటే సగుణారాధనయే శ్రేష్ఠమని తెలిపాడు. నిరాకార బ్రహ్మను జ్ఞాన, యోగ పద్ధతులతో గ్రహించడం శ్రమతో కూడినదని తెలిపాడు. ఈ మూడు మార్గాలలోను దేహాభి మానమే అడ్డుగా నిలుస్తున్నదని తెలుస్తున్నది.  భక్తి మార్గంలో అయితే భక్తుల కర్మలు, కర్మ ఫలితాలు అన్నీ ఆ పరమాత్మకే అర్పిస్తే శీఘ్రమే మోక్ష ప్రాప్తి కలుగు తుంది అని గీతాచార్యులు తెలిపారు. దీనికోసం అభ్యాస యోగం, అది కుదరకపోతే భగవదర్పిత బుద్ధితో కర్మల నాచరించడం, అదీ వీలుకాకపోతే కర్మ ఫలత్యాగం చేయడం, ఇలా అర్థమయ్యే సాధనలను చేయవలసిన ప్రయత్నాలను భక్తియోగం తెలియచేస్తుంది.

            గీతాచార్యులు నుడివిందేమంటే ‘‘తత్త్వం తెలియని అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్ఠం. అట్టి పాండిత్యం కంటె కర్మ ఫలత్యాగం గొప్పది. దానివలన పరమశాంతి లభిస్తుంది. శరీరాభిమానాన్ని వదలి, త్రిగుణాలతో కూడిన స్వభావాన్ని విడచినవాడు స్థితప్రజ్ఞుడు. అట్టి భక్తుడు అంటే పరమాత్మకు అత్యంత ప్రీతి’’ అని భగవద్గీతలోని భక్తియోగ సారాంశం.

            కనుక సాధకుడు ఏ మార్గంలో తన సాధన మొదలుపెట్టినా ఫలితం ప్రాప్తించే సమయానికి ఇతర యోగాలు కూడా కలసిపోతాయి. చివరకు మోక్షం అనేది అందరికీ ఒక్కటే. అయితే పరాభక్తి గొప్పదిగా నారద మహర్షి ప్రశంసిస్తారు.

            వశిష్ఠులవారు అన్ని యోగాలు వివరించి, స్వీయ మార్గం జ్ఞానమని చెప్తారు. శ్రీరామునికి కూడా ఆ జ్ఞాన మార్గమే సరిపోతుందని బోధించారు. ఏది గొప్పది అని మాత్రం వశిష్ఠులవారు తేల్చి చెప్పలేదు.

            శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథంలో శ్రీ సీతారాములు శ్రీ ఆంజనేయుల వారికి సాంఖ్య తారక అమనస్క యోగాలను నేర్పి, భక్త ఆంజనేయుని పరబ్రహ్మ స్వరూపంగా ఆరూఢం చేశారు.

      శ్లో||  దేహ బుద్ధ్యా-స్మి దాసోహం
            జీవబుద్ధ్ద్యాత్మ త్వదంశకః
            ఆత్మ బుద్ధ్యా త్వమేవాహమితి
            మేనిశ్చితా మతిః ||

తా||  దేహబుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతునికి దాసుడు. జీవ బుద్ధితో కూడిన ఆంజనేయుడు భగవంతుని అంశగా భావించి ఆ భగవంతునితో సమాన మంటున్నాడు. ఆత్మ బుద్ధితో కూడినప్పుడు ఆంజనేయుడు ఆ శ్రీరామునికంటే వేరుకాదు. ఇద్దరని లేకుండా ఒక్కటైన పరబ్రహ్మ స్వరూపమనేది శ్రీ ఆంజనేయుని స్వస్వరూపం.

            అత్రచ ప్రథమమ్‌ మహత్సేవ తతస్తద్ధర్మ శ్రద్ధా
            తతో భగవత్కథా శ్రవణమ్‌ తతో భగవతి రతిః తయాచ
            దేహద్వయ వివిక్తాత్మ జ్ఞానమ్‌ తతో దృఢభక్తిః
            తతో భగవతత్త్వ విజ్ఞానమ్‌ తత స్సర్వజ్ఞత్వాది గుణావిర్భావః ||

తా||  శ్రద్ధ అంటే కర్మ యోగం. తరువాతే భగవద్రతి అనగా భక్తి యోగం. తరువాత దేహ ద్వయ వివిక్త ఆత్మజ్ఞానం. ఇది జ్ఞాన యోగం. తరువాత దృఢ భక్తి. ఇది జ్ఞాననిష్ఠ లేక అనన్య భక్తి. సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాలు ముక్తుడికి పై క్రమంలో అయత్నంగా సిద్ధిస్తాయి.


            ఇక్కడ అన్ని యోగాలు అవసరంగా కనిపిస్తూ చివరకు అన్నీ సాధకుడిలో అప్రయత్నంగా జరిగి, ముక్తికి దారి తీస్తున్నట్లు శ్రీధరాచార్యులు వివరించారు.