24. నాస్త్యేవ తస్మిన్‌ తత్సుఖ సుఖిత్వమ్‌

24. నాస్త్యేవ తస్మిన్‌ తత్సుఖ సుఖిత్వమ్‌

            అయినా ఆ గోపికాంగనలకు ఆ విధమైన కామ సుఖాసక్తి బొత్తిగా లేదు. ఒకవేళ ఆ గోపికాంగనలు జారాంగనలై ఉంటే స్వార్థంతో వారి సుఖాన్ని మాత్రమే చూచుకునే వారు గాని, వారి ప్రియుని సుఖాన్ని గురించి అంతగా ఆలోచించేవారు కారు. ఇక్కడ చూస్తే శ్రీ కృష్ణుని సౌఖ్యమే వారు కాంక్షిస్తున్నారు. అందుకోసం వారు ఏ త్యాగానికైనా సిద్ధమై ఉన్నారు. శ్రీకృష్ణ సేవనే స్వధర్మంగా పాటించి, ఆయన సౌఖ్యమే వారి సౌఖ్యంగా భావించారు. వారి వారి కష్ట సుఖాలను కూడా పట్టించుకోలేదు. అందువలన ఆ గోపికాంగనల భక్తి పరాభక్తి క్రిందకే వస్తుంది. ఎందుకంటే ఆ కృష్ణ భక్తిలో ఉండడం వలన వారి వారి అహంకార మమకారాలు వాటికవే వదిలిపోయాయి.

            ఇచ్చుటెరుగును ప్రేమయె, ఎంతమాత్ర
            మైన ప్రత్యుపకారంబు నడగకెపుడు      -మెహెర్‌ బాబా

            భగవంతుని యెడల ప్రేమ నిజమైనచో తాను ప్రేమించు చున్నందుకు ప్రత్యుపకారం కోరదు. గోపికలు శ్రీ కృష్ణుని ఏమీ కోరలేదు. తమ ప్రియునికేమివ్వ గలమనే ఆలోచన తప్ప మరే దిగులు లేదు వారిలో.

            దివ్య ప్రియతమునైక్యమనే ధ్యేయమొకటె
            దక్క, తక్కిన కోరికల్‌ తగదు కోర           -మెహెర్‌ బాబా

            ఇచ్చుటేగాని కోరడమెరుగని గోపికల గురించి శ్రీ కృష్ణ పరమాత్మయే చెప్పాడు కదా, ఆ గోపికల భక్తికి తాను ఋణగ్రస్తుడయ్యాడని ? ఇక గోపి కాంగనల భక్తిని శంకించనవసరం లేదు.

            ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తి తోడ వ
            ర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సే
            వించు నతండు గాంచు నరవింద భవాదులకైన దుర్లభో
            దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మ మార్గముల్‌ ||
                                                                                            -భాగవతం

తా||  మాయ అనగా అజ్ఞానం. అజ్ఞానమనేది కొంచెమైనా ఉండరాదు. అంతా ఈశ్వరుడేననే సర్వాత్మ భావం పూర్తిగా ఉండాలి. ఇట్టి జ్ఞాననిష్ఠకే భక్తి అని పేరు.

            అలాగే గోపికాంగనలు కూడా సర్వత్రా ఆ శ్రీకృష్ణునినే గాంచు చుండేవారు. పరవశించి రాసలీలలో పాల్గొంటూ ''నారీ నారీ నడుమ మురారి''గా, ''హరికి హరికి నడుమ వయ్యారి''గా దర్శించేవారు. ఇదే వారి భక్తి విశేషం.
ద్వితీయాధ్యాయం