2. సాత్వస్మిన్‌ పరమప్రేమ రూపా

2. సాత్వస్మిన్‌ పరమప్రేమ రూపా

            భగవంతుని యెడల శ్రేష్ఠమైన ప్రేమ స్వరూపం, పరాభక్తి అవుతున్నది.
            భక్తి రస్యభజనం, ఏతదిహాముత్రోపాథి
            నైరాశ్యౌ నాముష్మిన్‌ మనఃకల్పమ్‌ ||
-గోపాల పూర్వతాపన్యుపనిషత్‌

            ఇహలోక, పరలోక సుఖాదులను అపేక్షించక భగవంతునిపట్ల మనసు లీనం చేయడమే భక్తి.

            ఇక్కడ అది అనగా ముక్తిదాయకమైన భక్తి. అదే పరాభక్తి. భక్తి అంటే ప్రేమ స్వరూపం అన్నప్పుడా భక్తి భగవంతునిపై గలది మాత్రమే కావాలి. కాని ప్రాపంచిక వస్తువులమీద గాని, ప్రాణులమీదగాని, సంసారంలో భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, మిత్రులమీద ఉండే ప్రేమగాని కాదు. లౌకిక వస్తుజాలంపై ఉండే ప్రేమను అనురాగమంటారు. ఈ రాగమే ఒక్కోసారి ద్వేషంగా మారుతుంది. భగవంతుని యెడల జనించే ప్రేమ సహజం, తరగనిది. అది ఒకప్పుడు లేకుండా పోదు. సాధారణంగా భక్తి అనేది మొదట్లో భగవంతునిమీద కూడా మానవులకు చేతనైన పద్ధతిలో రాగంగానే ఉంటుంది. దీనిని ముందు చెప్పబడబోయే సాధనచేత సహజ ప్రేమగా మారినప్పుడది నిజమైన భక్తి అవుతుంది. దాని పరాకాష్ఠలో పరమప్రేమ అని గాని, ప్రేమ స్వరూపమని గాని అంటారు.

            ఏది ప్రేమానుభవాన్ని కలిగిస్తుందో, చివరికి భగవత్సాక్షాత్కారాన్ని కూడా కలిగిస్తుందో, అదే శ్రేష్ఠమైన ప్రేమ, పరమప్రేమలో భక్తుని బుద్ధి, భగవంతునిలో లీనమవుతుంది. ఇట్టి పరమప్రేమనే లక్ష్యంగా సాధన చేయవలసి ఉంటుంది. ''భగవంతుడు నా వాడు'' అనే మమకారంతో మొదలయ్యేది భక్తి. ఈ భక్తి భావం కలగాలంటే భక్తుని మనసు ప్రాపంచిక, సాంసారిక విషయాలను విడచి కేవలం భగవంతుని మీదనే తన ధ్యాసనంతా నిలపాలి. అనగా యే కోరిక కోరకుండా ''భక్తి కోసమే భక్తి''గా భగవంతుని సేవించడం భగవంతుని యెడల పరమప్రేమ అవుతుంది. ఈ భక్తి తైలధార వలె తెంపు లేకుండా సాగిపోవాలి. భగవంతుని ప్రీతి పూర్వకంగా ధ్యానించాలి. అది అలవాటుగా మారాలి. చివరికి అది భక్తుని శీలంగా మారాలి. అదే శ్రేష్ఠమైన భక్తి అవుతుంది. ఈ భక్తిలో జనించే ప్రేమ అలౌకికం. ఈ భక్తే మోక్ష సాధనం.

శ్లో||  మోక్షకారణ సామాగ్య్రాం భక్తిరేవ గరీయసి |
         స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ||

శ్లో||  స్వాత్మ తత్త్వానుసంధానం భక్తిరిత్య పరేజగుః |
                                                                 -వివేక చూడామణి

తా||  మోక్షం కావాలంటే భక్తి సాధనయే గొప్పది. తనలో గుహ్యంగా ఉన్న పరమాత్మతో అనుసంధానం చేయడమే భక్తి అనబడుతుంది.

            తన ఆత్మ తత్త్వాన్ని పరమాత్మ తత్త్వంతో అనుసంధానం చేసే సాధనను భక్తి అని పెద్దలు పలికారు.