16. పూజాదిష్వనురాగ ఇతిపారాశర్యః

16. పూజాదిష్వనురాగ ఇతిపారాశర్యః

            పరాశర మతం ప్రకారం, భక్తుడు మొదట పూజాది కర్మకాండలు జరుపగా జరుపగా, ఆ భగవత్సేవ ఒక నాటికి అనురాగంగా మారుతుంది. అట్టి అనురాగమే పరాభక్తి అవుతుంది.

            ఈ భక్తి ముందుగా కాయిక, వాచిక, మానసిక భక్తిగా మూడు విధాలు. ఇవి తామసిక, రాజసిక, సాత్విక భక్తిగా ఉంటాయి. కనుక దీనిని గౌణభక్తిగా పేర్కొంటారు. సహజమైన అనురాగం లేక భగవత్ప్రీతి కలిగాక ఈ గౌణభక్తి ముఖ్యభక్తిగా మారుతుంది. అప్పుడు పూజాది బాహ్యభక్తి క్రియలు వాటంతట అవే ఆగిపోయి కాయిక, వాచిక, మానసిక భక్తి అనేది హృదయపూర్వకమై నిరంతరంగా ఉండే సహజస్థితిని సంతరించు కుంటుంది.

            గౌణభక్తి కోరికలతో కూడినది కాకుండా నిష్కామంగా ఉండాలి. తన కోసంగా కాక భగవంతుని కోసంగా ఉండాలి. భగవంతుని ప్రేమించ కుండా ఉండలేని స్థితిలో ‘‘భక్తి కోసమే భక్తి’’గా ఉండాలి. అప్పుడు కాయిక, వాచిక భక్తి మానసిక భక్తిగా రూపాంతరం చెందుతుంది. చివరికి మానసిక భక్తి హృదయ పూర్వకంగా పరిణమిస్తుంది. హృదయ పూర్వకంగా మారిన భక్తితో కాయిక, వాచిక, మానసిక భక్తి క్రియలు వాటంతట అవే ఆగిపోతాయి.

            మానసిక భక్తి తీవ్ర పరితాపంగా మారినప్పుడు భక్తి భావం సహజంగా ఉప్పొంగుతుంది. అట్టి భక్తి అంకితభావంతో పరిపోషించబడు తుంది. మనం చేసే భక్తి సాధనలలో అది హృదయ పూర్వకంగా మారక పోతే, భక్తిని కర్మకాండగా జరపడం వ్యర్థం. ఆలస్యమైనా, లక్ష్యం ఉంటే కర్మకాండ చేయవచ్చును. ఆ లక్ష్యం లేనివారు కర్మకాండగా భక్తి జరపడం కంటే మానివేయడమే మంచిది.

            హృదయమే లేని పూజనాచరించుట కన్న
            మానివేయుట కడునుత్తమంబు సుమ్ము
                                                                -మెహెర్‌ బాబా

            హృదయ పూర్వక భక్తి భగవంతుని మీదనే కాకుండా భాగవతోత్త ముల మీదను, ఆచార్యుల మీదను కూడా ఉంటుంది. భక్తుని భావన దాసానుదాసుడుగా ఉంటుంది. అతడు నమ్రత, అణకువ, విధేయత, అర్పణ భావాలు కలిగి ఉంటాడు. అతడిలో ‘‘నేను’’ అనేది చచ్చిపోయేటంతటగా తగ్గి ఉంటుంది. అప్పుడే అతడు భగవదనుగ్రహం పొందుతాడు. భగవంతునితో నిరంతర సాన్నిధ్యాన్ని అనుభవిస్తాడు. మైమరచి, పరవశించి ఉంటాడు.


            ఈ చెప్పినదంతా భక్తి సాధనలో భాగమే. అయితే భవత్సాక్షాత్కారం కలిగిన తరువాత కూడా పూజాదికాలు జరిపే పరాభక్తులు కూడా ఉంటారు. నిజానికి వారికవి అవసరం లేవు. అయినా ఇతరులు ఆ విధంగా సాధన చేయాలని చేస్తూ ఉంటారు. వారిలో ఇలా చేయాలని ఒక ప్రేరణ ఉంటుంది. వారిలో లోకాన్ని పట్టించుకునే ఆలోచన ఉండదు. కాని ఈ విధమైన ప్రేరణలు సాధకులకు మార్గదర్శకంగా ఉండటానికి పనికి వస్తాయి. ఇట్టి దైవీ ప్రేరణ వలన భగవంతునికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఉత్సవ ఊరేగింపులు, ఏకాహం, సప్తాహం వంటివి దేవాలయ పునర్నిర్మాణాలు, అన్న సంతర్పణలు, దీనజన సేవ, ఇవన్నీ నారాయణసేవగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి పరాభక్తుని విషయంలో పూజాదికాలే అవుతాయి.