7. సా నకామయమానా, నిరోధ రూపత్వాత్‌

7. సా నకామయమానా, నిరోధ రూపత్వాత్‌

            పరమప్రేమ రూపమైన భక్తి ప్రాపంచిక వస్తువులపట్ల గల ప్రీతి రూపమైన కామం కాదు, దానికి వ్యతిరేకమైనది. అది అలౌకికమైనట్టి భగవంతునిపై ఉండే ప్రేమ.

            భక్తికి, కామానికి గల భేదం చెప్తున్నారు. కామం అనేది ఇంద్రియాలకు, మనసుకు చెందినది. నిమిత్త కారణంపై కామంజనిస్తుంది. భగవత్ప్రేమ అలా కాదు. అది మనస్సుకు సంబంధించినది కాదు. హృదయానికి సంబంధించినది. అది సహజంగా ఉప్పొంగేది. మనోతీత మైనది. ప్రహ్లాదుడికి, ధృవుడికి వారి శైశవంలోనే భగవత్ప్రేమ పుట్టింది. కన్నప్ప, వివేకానంద, దయానంద మొదలగు వారిలో, వారి యవ్వనంలో భగవంతునిమీద ప్రీతి కలిగింది.

            కామం జనించడానికి పూర్వ విషయ వాసనలు కారణం. కాని భక్తి అనేది గత జన్మల శుభవాసనల వలన కలుగుతుంది. కొందరిలో అశుభ వాసనలు ఎక్కువ ఉన్నప్పటికీ అంతో ఇంతో శుభ వాసనలు కూడా ఉంటాయి. ఈ శుభవాసనల వలన ఎప్పటికైనా బ్రహ్మానందానుభవం కలగడానికి అంకురం ఉంటుంది. అది వెంటనే అంకురించవచ్చును లేక కొంత జాప్యం జరుగవచ్చు. కొన్ని కారణాల వలన మందంగా గాని, మధ్యమంగా గాని, తీవ్రంగా గాని ఉంటుంది.

            ఈ శుభవాసన ఎందుకుంటుందంటే, పరమాత్మ నుండి వేరైన ఆత్మ కూడా తత్త్వంగా చూస్తే పరమాత్మయే. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు, పరమాత్మ ఆత్మల మధ్య సహజమైన ఆకర్షణ ఉంటుంది. ఇట్టి ఆకర్షణనే భగవదనుగ్రహంగా చెప్పవచ్చు. అశుభ వాసనల కారణంగా ఆత్మ అజ్ఞానావరణలో కప్పబడి ఉన్నందున, పరమాత్మతో అనుసంధానం కాలేకపోతున్నది. ఎప్పుడైతే శుభవాసన వృత్తిగా మారుతుందో, అప్పుడు ఆత్మకున్న ఆవరణ కొద్దికొద్దిగా తొలగడం ప్రారంభమై పరమాత్మతో ఒక్కటయ్యేదాకా భక్తిని పెంపొందించు కుంటుంది. అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోతుంది.

            మొదట అది కారణంతో కూడిన భక్తిగా ఉదయించి, గౌణభక్తి అని పిలువబడుతుంది. క్రమంగా భగవదైక్యం జరిగే సరికి అది ముఖ్య భక్తిగా పరిణ మిస్తుంది. ఐక్యతాసిద్ధితో పరాభక్తి అని పిలువబడుతుంది. ఇక్కడ ఆత్మ అంటే వ్యవహారంలో ''నేను''గా తోచిన పురుషుడు. ఆ నేనే సాధకుడు, లేక భక్తుడు.   

            ఆధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సధ్య్రక్‌
            సచ్ఛ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వ దసంప్రమాదేన యమేన వాచాం
            కర్మాశయం హృదయగ్రంథి బంధ మవిద్యయాసాదితమప్రమత్తః
            అనేన యోగేన యథోపదేశమ్‌ సమ్యగ్వ్య పోహ్యోపరమేతం యోగాత్‌
-ఋషభుని ఉపదేశం

తా|| వివిక్త సేవ, ఆధ్యాత్మ యోగం, ఇంద్రియ ప్రాణ, మనో నిగ్రహం, శ్రద్ధ, బ్రహ్మచర్యం, యమం, నియమం, వీటిచే అవిద్యా గ్రంథి విడిపోగా, సమాధి స్థితిలో లింగదేహ భంగమును ఏ భక్తుడు సాధించి నిష్క్రమిస్తాడో వాడే సాయుజ్యం చెందినవాడు. వాడే పరాభక్తుడు.