22. తత్రాపి న మహాత్మ్య జ్ఞాన విస్మృతి త్యపవాదః

22. తత్రాపి న మహాత్మ్య జ్ఞాన విస్మృతి త్యపవాదః

            గోపికలు లౌకికమైన కామదృష్టితో వ్యవహరించి ఉండవచ్చునని సందేహించినా, లేకపోతే ఆ గోపికలు శ్రీకృష్ణ స్వామిని, మానవునిగానే భావించినా ఆ శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని ఉదాహరణగా ఒక కథ ఉన్నది. అయినా భగవద్గీతను ఉపదేశించి తాను కర్మయోగిగా ప్రసిద్ధి కెక్కినది అందరికీ తెలిసినదే.

            శ్రీ కృష్ణుడు గోపికల ప్రేమలో వ్యత్యాసమున్నదనుకున్నా, గోపికల ప్రేమ కామంతో కూడినదిగా, శ్రీ కృష్ణుని ప్రేమ దైవీ ప్రేమగా గుర్తించి చూద్దాం. ఈ రెండు ప్రేమలూ కలిశాయి అనుకుందాం. ఉదాహరణగా రెండు పదార్థాల కలయికలో దేని ప్రభావం ఎక్కువో దాని ప్రభావమే రెండవదాని మీద పని చేస్తుంది. అగ్ని ప్రభావం ఎక్కువైతే నీరు ఆవిరౌతుంది. నీటి ప్రభావం ఎక్కువైతే అగ్ని చల్లారిపోతుంది. ఇక్కడ శ్రీ కృష్ణుని ప్రేమ మహత్తుతోను, జ్ఞానంతోనూ కూడిందగుటచేత ఆ కృష్ణ ప్రేమ గోపికల ప్రేమ ప్రభావాన్ని అణచివేస్తుంది. అనగా కామ్యకమైన గోపికల ప్రేమ ఆవిరైపోతుంది. వారిలో దైవీ ప్రేమ ప్రతిష్ఠితమవుతుంది.


            మరొక ఉదాహరణ చూద్దాం. వెలుగును చీకటి, చీకటిగా మారుస్తుందా? లేక చీకటిని వెలుగు, వెలుగుగా మారుస్తుందా ? ఇక్కడ జ్ఞాన ప్రకాశమే గోపికల లోని అజ్ఞానమనే చీకటిని వెలుగుగా మారుస్తుంది. అందువలన గోపికల మానవ సహజమైన ప్రేమకు ప్రతిగా శ్రీకృష్ణుని దివ్య ప్రేమ స్పర్శతో గోపికల ప్రేమ కూడా దివ్యమే అవుతుంది.