14. లోకోఽపి తావదేవ, భోజనాది వ్యాపారస్త్వా శరీర ధారణావధి

14.   లోకోఽపి తావదేవ, భోజనాది వ్యాపారస్త్వా శరీర ధారణావధి

            లోకాచారాలు దేశకాల పాత్రతలనుబట్టి భిన్న భిన్నంగా ఉంటాయి. నియమాలు అన్ని చోట్లా, అన్ని కాలాలలో అందరిలో ఒకే విధంగా ఉండవు. సిద్ధుడికి మాత్రం ఏ నియమం వర్తించదు. అతడు ఒకప్పుడు లోకాచారానికి విరుద్ధంగా కూడా ఉండవచ్చును. ఎందుకంటే అతడు స్వయం బుద్ధితో పనిచేయడు. ఈశ్వర ప్రేరణను బట్టి వర్తిస్తాడు. ఆ పరాభక్తుడేది ఆచరిస్తే అదే ధర్మమౌతుంది. ఈ విధమైన మార్పుకు కారణం దేశ కాల పాత్రతలలో వచ్చిన మార్పే గాని అది పూర్వ శాస్త్ర తిరస్కారం కాదు.

            శరీర ధారణ విషయంలోను, భోజనాది వ్యాపారాల విషయంలోను అతడు తన జీవితాన్ని భగవత్సేవకు వినియోగపడేలా ఉంటాడు. అంతేగాని శరీరేంద్రియ, లోక సంబంధ విషయాలను అతడెప్పుడో అధిగమించే ఉన్నాడు. ఏనాడో భగవదర్పితమయి ఉన్నాడు. తన శరీర పోషణ కొరకు  కాకుండా, భగవత్సేవ కొరకు మాత్రమే ఏదైనా చేస్తూ ఉంటాడు. అయినా వ్యాధి, బాధలు కలిగినప్పుడు శరీర పోషణను ఉపేక్షించడు. అతడు శరీరాభి మానాన్ని విడచినవాడు గనుక, ఆ శరీరాన్ని భగవత్సేవకు ఉపయోగపడే పనిముట్టుగా భావించి దానిని పనిచేసే స్థితిలో ఉంచుకోవడానికన్నట్లు బాగు చేసుకుంటూ ఉంటాడు. సార్వజనీనమైన సామాన్యమైన రీతిలో ఇతరుల ఉన్నతికొరకు వ్యవహరిస్తూ ఉంటాడు.