12. భవతు నిశ్చయ దార్డ్యా దూర్థ్వ శాస్త్ర రక్షణమ్‌

12.   భవతు నిశ్చయ దార్డ్యా దూర్థ్వ శాస్త్ర రక్షణమ్‌

            లోక వ్యాపారంగాని, వైదిక వ్యాపారం గాని, చివరకు మోక్షార్థ సాధన క్రియలు గాని, ఈ భక్తుడు చేయడు. అప్పుడు ఆ భక్తుడు ఊరకే ఉండాలి కదా! కాని ఊరకుండలేడు. అందుకని శాస్త్రార్థాలను అనుష్ఠిస్తూ ఉంటాడు. శాస్త్రాలు సాధకులకు అవసరమే గాని, పరాభక్తులకు అవసరం లేదు. అయినప్పటికీ భగవంతుని నిర్ణయించే శాస్త్రమంటే అతడికి ప్రీతి ఉండటం చేత అనుష్ఠానం చేస్తూ, ఉపరతి పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడం వలన సాధకులకు ఆదర్శంగానూ, మార్గదర్శంగానూ ఉంటాడు. దీనినే శాస్త్ర రక్షణ అంటారు.

            దేశ కాల పాత్రతలకు తగినట్లుగా సాధనలను మార్చవలసి ఉంటుంది. ఈ పరాభక్తుడు అప్రయత్నంగా చేసే పనులు ఇతరుల సాధనకు మార్గదర్శకంగా పనికి వస్తాయి. ఈ మార్పులు ఒకప్పుడు పూర్వ శాస్త్రానికి కొంచెం సవరించినట్లుగా ఉంటాయి. ఈ విధంగా పరాభక్తుడు శాస్త్రాలలో క్రమంగా మార్పులు చేయడం జరుగుతుంది. పరాభక్తుడంటే సిద్ధుడు గనుక, అతడే ప్రమాణం. పూర్వ శాస్త్ర ప్రమాణాలను నవీనీకరించడానికి అతడికి అధికారమున్నది. ఈ విధంగా అతడి వలన శాస్త్ర రక్షణ జరుగుతూ ఉంటుంది. శాస్త్రాలు సంస్కరించబడతాయి. పరాభక్తుడు నిశ్చయ జ్ఞానంతో త్రికాలాబాధ్యమైన సాధ్యం కొరకు దేశ కాలమాన పాత్రతలతో  పరిమిత పరచబడే సాధనలలోని ఆచరణ విధానం ఇట్టి మహనీయుల ఆచరణ వలన సంస్కరింపబడి సర్వజనామోదంగా చేయబడుతుంది.

            అతడి అనుష్ఠానంలో ఉండే మార్పులు సహజం, అప్రయత్నం. అవి దైవీ ప్రేరణతో జరిగేవి. తాను ఈ మార్పులు జరగడానికి అధికారిఅని అతడికి తెలియదు. ‘‘నేను అధికారిని’’ అని ఎవరైనా శాస్త్రాలను మార్పు చేస్తే, అతడు పరాభక్తుడు కాడు. అందువల్ల అది సర్వజనామోదం కాదు.

            శాస్త్రానికి ఆధారం ఎవరో ఒకరి అనుభవం మొదటగా ఉండాలి. అనుభవం శాస్త్రాన్నిస్తుంది గాని శాస్త్రం అనుభవాన్నివ్వదు. కాని శాస్త్రమనేది లక్ష్యం చేరడానికి మార్గదర్శకంగా ఉంటుంది. కనుక సిద్ధులు, పరాభక్తులు వారి అనుభవాలలోనుండి చెప్పేవీ, చేసేవీ శాస్త్రాలవుతాయి. శాస్త్రాలు సాధకులకు కరదీపికగా పనికివస్తాయి.

            జిల్లేళ్ళమూడి అమ్మ అంటారు.’’నాకు శాస్త్ర పరిచయం లేదు నాన్నా. నేను ఏది చెప్పినా అనుభవంలోదే చెబుతాను. అనుభవం శాస్త్రాన్నిస్తుంది. కాని శాస్త్రం అనుభవాన్నివ్వదు’’. ఈ విధంగా అవతారులు, కారణ జన్ములు, భాగవతోత్తములు, జీవన్ముక్తులు ఆయా కాలాలలో శాస్త్ర ప్రమాణాలను నవీనీకరిస్తూ శాస్త్ర రక్షణ చేస్తూ ఉంటారు.

            సిద్ధులైన వారికి త్రికాల జ్ఞానం ఉంటుంది. ఎప్పటికి ఏది మేలో నిశ్చయించి చేస్తారు. ఈ కారణం వల్లనే పెద్దలు నడచిన త్రోవను నడవ మన్నారు. మిథ్యాచార్యుల నాశ్రయించరాదు. గమ్యం చేరిన మహనీయులను మాత్రమే ఆశ్రయించాలి.